18, డిసెంబర్ 2024, బుధవారం
ధ్యానం వల్ల 100 ప్రయోజనాలు.....
బిల్వపత్రం విశిష్టత
ద్రాక్షారామం
తూర్పుగోదావరి జిల్లా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎంతో చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఓసారి వచ్చి చూడండి.
తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి
ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం 70 అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది.
భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పైఅంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది.
ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. సప్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.
ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు
వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి. ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ- ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని ఎలుగెత్తి ఘోషించే భక్తులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.
గంగతో సమానమైన దధీచి కుండం
గంగతో సమానమైన దధీచి కుండం- జీవితంలో ఒక్కసారైనా అందులో స్నానం చేయాల్సిందే!
88వేల నదుల్లో స్నానమాచరించే ఫలితం- సకల పాపాలను పోగొట్టే దధీచి కుండం విశిష్టత తెలుసా?
వ్యాస మహర్షి చెప్పినట్లుగా కృతయుగం తో సమానమైన యుగం కానీ, వేదం తో సమానమైన శాస్త్రం కానీ, కార్తిక మాసంతో సమానమైన మాసం కానీ, గంగా తీర్థం తో సమానమైన తీర్థం కానీ లేదని అంటారు. అలాంటి పరమ పావనమైన గంగానదిలో సమానమైన తీర్థం మన దేశంలో ఎక్కడుందో తెలుసా! కేవలం స్పర్శతోనే సమస్త పాపాలు నశింపజేసే ఆ తీర్థ రాజం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దధీచి కుండం విశిష్టత
ఉత్తర్ప్రదేశ్లోని నైమిశారణ్యం పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో ఋషులు, మునులను తపస్సు చేసుకోవాలని ఆదేశించినట్లుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇంతటి పావన ప్రదేశమైన నైమిశారణ్యంలో దధీచి కుండం ఉంది. ఈ దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్ర వచనం. దధీచి కుండానికి ఇంతటి మహత్యం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పౌరాణిక గాధ ఏమిటి?ఘనత వహించిన మన మహర్షులు
మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే దేశ సుభిక్షానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.ఎవరీ దధీచి?
దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. దధీచి విష్ణువుని ప్రసన్నం చేసుకుని తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించేలా వరాన్ని పొందుతాడు.సురాసురుల యుద్ధం
ఒకసారి రాక్షసులు వృతాసురుని ఆధ్వర్యంలో స్వర్గాధిపతి ఇంద్రునిపై యుద్ధానికి వెళ్లారు. దేవతల వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో వారు చేసిన ఈ భీకర యుద్ధంలో వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటకి పరుగులు తీసి దధీచి దగ్గరకు వచ్చి వారి అస్త్రశస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు తిరిగి పరుగులు తీస్తారు. దధీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు.
అస్త్రశస్త్రాలను అవపోసిన పట్టేసిన దధీచి
దధీచి మహర్షి దేవతలు వచ్చి వారి అస్త్రశస్త్రాలను తిరిగి తీసుకెళ్తారని ఎంతో కాలం ఎదురుచూసి వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే అవపోసన పట్టేస్తారు.శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన ఇంద్రాది దేవతలు.ఆదిత్యయోగీ.
వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువుని కోరుతారు. దానికి విష్ణుమూర్తి దధీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెపుతారు.దధీచిని వేడుకున్న దేవతలు
దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ల కోరికను విన్నవించుకున్నారు. దధీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ల కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దధీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు. అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.దధీచి కుండం ఇలా ఏర్పడింది!
లోక కల్యాణం కోసం దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధపడిన సమయంలో ఆయన కోరిక మేరకు ఇంద్రాది దేవతలు 88 వేల నదీ జలాలతో ఆయనకు స్నానం చేయించారు. అలా ఆయనకు స్నానం చేయించిన నీటితో ఏర్పడినదే 'దధీచి కుండం'.పాపనాశిని దధీచి కుండం
నైమిశారణ్యం వెళ్లినవారు ఈ కుండంలోని నీటిని 'గంగతో సమానమైనవిగా భావిస్తుంటారు. దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని అంటారు. మనం కూడా జీవితంలో ఒక్కసారైనా నైమిశారణ్యం వెళ్లి దధీచి కుండం లోని నీటి స్పర్శతో పావనమవుదాం.
పళని మురుగన్ మహత్యం
పళని మురుగన్ మహత్యం
అంతుబట్టని నవ పాషాణం!
అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.
వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.
సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.
నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.
నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.
మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు.
"అన్నీ వదిలేసి నన్ను చేరుకో"
అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.
"స్థలపురాణం"
ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.
కావడీ ఉత్సవం!
దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.
ఏమిటీ నవ పాషాణం!
పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.
దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm
"ఎవరీ సిద్ధ భోగర్?"
క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.
తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్ ఒకరు. గురువైన కాలంగి నాథర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు.
అందుకే... పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!
పంచామృతం!
లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*
సూర్యదేవాలయం - గొల్లల మామిడాల
సూర్యదేవాలయం - గొల్లల మామిడాల
కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.
మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి.అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగాఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి
.దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది.రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.
వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు,కాలువలు,కాకినాడ ప్రాంతం,ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ....
ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు.ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.....
ఆలయానికి చేరుకొనే మార్గం :
మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంల ఉంటుంది.కాకినాడ,రాజమండ్రి,
సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు...
శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం
"పాతాళ సెంబు మురుగన్ దేవాలయంలోని స్వామిని దర్శించిన పిమ్మట, అక్కడ 41 రోజులపాటు స్వామి మీద వేసి ఉంచి, అభిషేకించిన కరుంగళి మాలలకే శక్తి వస్తుంది. వాటిని ధరించిన వారికే ఫలితం ఉంటుందని సిద్దార్ భోగర్ వరమిచ్చాడు" అనేది ఆలయ ప్రాశస్త్యం.
అసలు కథలోకి వెళ్తే...
రామలింగంపట్టి శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్‌లోని రామలింగపట్టిలోని భోగర్ నగర్‌లో ఉంది. ఇక్కడి ప్రధాన దైవం మురుగన్. ఇక్కడ పాతాల సెంబు మురుగన్ అని పిలుస్తారు. పళని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని పశ్చిమ కనుమల పర్వతాలు మరియు దేవర్మలై చుట్టుముట్టాయి. ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపలికి 16 అడుగుల గుహలో ఉంది అందుకే పాతాళ (భూగర్భ) సెంబు (రాగి) మురుగన్ అనే పేరు వచ్చింది అంటారు. భూగర్భ గర్భాలయానికి చేరుకోవడానికి భక్తులు 18 మెట్లు దిగాలి. ఈ "పాతాళ సెంబు" అనే పదానికి "బంగారు మురుగన్" అని మరొక అర్ధం కూడా ఉందని అంటారు. ఈ రూపాన్ని శ్రేయస్సు మరియు రక్షణ కోసం పూజిస్తారు. భూగర్భ గుహలో నిలుచుని స్థితిలో ఉన్న మురుగన్ కుడిచేతి అభయ ముద్రను ప్రదర్శిస్తుంది మరియు ఎడమ చేతిలో వేల్ (ఈటె) ఉంటుంది.
పురాణాల ప్రకారం, సిద్ధ సాధువు, బోగర్, భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవపాషణం ఉపయోగించి పళనిలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడు. భోగరుడు సప్తఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి శిష్యుడు. పూర్వానికి తిరుకోవిలూర్ సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు, ఇతను భోగరుడి అవతారంగా భావించబడతాడు. తిరుకోవిలూర్ సిద్ధార్ ఈ క్షేత్రంలో మురుగ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఇక్కడ ఆయనకు పూజలు చేశారు.
1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంది. ఈ దేవాలయం సుప్రసిద్ధ పరిహార స్థలం. ఎంతోమంది భక్తులు తమ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి నివారణల కోసం ఇక్కడకు వస్తారు. ఇక్కడి మురుగన్ దేవతా ప్రతిమ నవపాషణంతో తయారు చేయబడింది. ఇది 5 లోహాలను కలిగి ఉంటుంది - బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం. భూగర్భ గుహలో ఉన్న విగ్రహానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తారు. రామనాథపురం సంస్థానానికి చెందిన రాజు భాస్కర సేతుపతి వంశస్థుడైన గంధమారన్ విగ్రహం యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు
పవిత్రమైన విభూతి ఆలయంలో ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ సువాసనగల విభూతి 18 రకాల మూలికలతో తయారు చేయబడిందని, వివిధ రకాల వ్యాధులను నయం చేయగలదని భక్తుల విశ్వాసం. ఇందులో దైవీ గుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు.
ఇక్కడి ప్రత్యేకత ఏమంటే భూగృహలో ఉన్న మురుగన్ ప్రతిమ మీద మరియు పాదాల వద్ద ఉంచి అభిషేకించిన కరుంగళి మాలలను భక్తులు అత్యంత విశ్వాసంతో, భక్తి శ్రద్దలతో ధరిస్తారు. ఈ కరుంగళి మాల ధరించడం వల్ల ఆ వ్యక్తి యొక్క నెగటివ్ పవర్ తొలగిపోతుందని విశ్వాసం. ప్రతికూల ప్రభావాలను పరిష్కరించగలవని, మంచి ఆరోగ్యం మరియు సంపదను తీసుకురాగలవని మరియు ప్రతికూల శక్తులను తిప్పికొట్టగలవని, వివాహంలో జాప్యం, సంతానలేమి, శత్రువులపై విజయం, వృత్తిలో రాణించడం, రాహు, కేతు మరియు కుజ దోషాల నుండి ఉపశమనం, భూమి మరియు ఆస్తి తగాదాల పరిష్కారం, విద్య, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.
#అరుణాచలశివ 🙏
తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము
తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...
-
Attirala (Telugu: అత్తిరాల) is an uninhabited village. There is the temple of sri Thretheswara swamy in the form of a stone sivalingam. ...
-
Ameen Peer Dargah (Asthana-e-Magdoom Ilahi Dargah complex) (Badi Dargah, Pedda Dargah) in Kadapa (Cuddapah) City is an example of the...
-
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం – శింగరకొండ ప్రకాశం జిల్లా శింగరాయ కొండ గ్రామమునందు శ్రీప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. శ్రీవరా...






.jpg)


