Mythology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mythology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!

 



ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. 

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. 

ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. 

ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.

ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. 

అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. 

ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. 

నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. 

నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 

అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు.

 ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. 

అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది.

 నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. 

అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. 

వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. 

పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. 

అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. 

ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. 

చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 

స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. 

ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి.

 అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. 

శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. 

బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు.

అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. 

ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 

ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. 

ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. 

వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు.

 మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. 

కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. 

పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. 

ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది.


మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది.


నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. 

వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు.


ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. 

తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. 

ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 

మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు.

 శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. 

వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

శ్రీ మధ్వాచార్యులు శ్రీకృష్ణుని మఠంలో పూజించడం ప్రారంభించారు మరియు అష్ట మఠాల (ఎనిమిది మఠాలు) స్వామీజీ ద్వారా శ్రీకృష్ణుని పూజించే "పర్యాయ" విధానాన్ని ప్రారంభించారు. విగ్రహాన్ని తాకి పూజించే హక్కు శ్రీ మధ్వాచార్యుల ఆధ్యాత్మిక వారసులైన ఎనిమిది మఠాల పీఠాధిపతులపై ఉంటుంది. ఎనిమిది మఠాలకు చెందిన స్వామీజీలు ఒక్కొక్కరు రెండేళ్లపాటు శ్రీకృష్ణ మఠంలో పూజలు నిర్వహిస్తారు. భ్రమణం ద్వారా చేసే ఈ కాలాన్ని "పర్యాయ" అంటారు. ఏ సమయంలోనైనా ఆరాధనకు బాధ్యత వహించే స్వామీజీని 'పర్యాయ స్వామీజీ' అని పిలుస్తారు మరియు అతని మఠాన్ని 'పర్యాయ మఠం' అని పిలుస్తారు. ఎనిమిది పర్యాయ మఠాలు సోడే మఠం, పెజ్వర్ మఠం, పుట్టిగే మఠం, అద్మార్ మఠం, కనియూర్ మఠం, పలిమారు మఠం, షిరూర్ మఠం మరియు కృష్ణపుర మఠం. ప్రస్తుత పర్యాయ స్వామీజీ శ్రీ సోధే మఠానికి చెందిన “శ్రీ విశ్వవల్లభ తీర్థ స్వామీజీ”.

ఉడిపిలో చంద్రమౌళీశ్వర మరియు అనాథేశ్వర ఆలయాలు అనే రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి. శివుడు లింగ రూపంలో కనిపించి వెండి పీఠాన్ని ఆక్రమించి ఇక్కడ అనంతేశ్వరుడిగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. శాపం నుండి విముక్తి కోసం చంద్రుడు 'చంద్ర పుష్కరిణి' అనే పవిత్ర చెరువు ఒడ్డున ఉన్న శివుడిని పూజించాడు. అతని పూజలకు శివుడు సంతోషించి చంద్రునికి ప్రత్యక్షమై శాపవిమోచనం చేసాడు.అందుకే శివుడిని చంద్రమౌళీశ్వరుడు అని పిలుస్తారు మరియు ఈ ప్రదేశంలో చంద్రమౌళీశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది. పురాతన కాలంలో ఉడిపిని శివల్లి లేదా శివ-బెల్లి లేదా రజతపీఠ పుర అని పిలిచేవారు. పరశురాముని యొక్క గొప్ప భక్తుడైన రామభోజుడు పరశురామ క్షేత్రానికి రాజుగా ప్రకటించబడినందున ఈ ప్రదేశం రజతపీఠ పుటగా పిలువబడింది. మహాయజ్ఞం చేయాలనే ఉద్దేశ్యంతో యజ్ఞస్థలం దున్నుతుండగా ఒక పాము చంపబడింది.సర్ప దోషం (పామును చంపిన పాపం) నుండి తనను తాను విముక్తి చేసుకోవడానికి, దానిపై పాము చిత్రాలతో చెక్కబడిన వెండి పీఠాన్ని (రజత పీఠం) తయారు చేయమని రామబోజ రాజును పరశురాముడు ఆదేశించాడు.దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి కోసం శివుడిని తపస్సు చేసిన చంద్రుడు చంద్రుడి పేరు మీద రాజతపీఠ పురా అని పేరు పెట్టారు..సంస్కృతంలో ఉడు అంటే `నక్షత్రం’ మరియు ప అంటే `నాయకుడు’. చంద్రుడు నక్షత్రాలకు అధిపతి కావడంతో ఆ ప్రాంతానికి `ఉడిపి` అని పేరు వచ్చింది.


ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం విశేషాలు

  • కనకన కిండి: కృష్ణ దర్శనం నవగ్రహ కిండి ద్వారా జరుగుతుంది, కిండి వెనుక ఉన్న పురాణం 16వ శతాబ్దపు కనకదాసు మరియు శ్రీ కృష్ణుని శిష్యుడు శ్రీకృష్ణుని ఆరాధించడానికి ఉడిపికి వచ్చాడు. కానీ అతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి మఠం లోపలికి అనుమతించబడలేదు మరియు అతను దొంగతనానికి పాల్పడ్డాడని భావించి మఠం వెనుక ఉన్న స్తంభానికి కట్టివేయబడింది. కనకదాసు ఆరాధనకు సంతసించిన శ్రీకృష్ణుడు మఠం వెనుక గోడకు చిన్న రంధ్రం చేసి కనకదాసుకు దర్శనమిచ్చి, కనకదాసుకు కనిపించేలా రంధ్రం వైపుకు తిప్పాడు. ఈ రంధ్రాన్ని కనకన కింది అని పిలుస్తారు.


  • ఆలయ స్వర్ణ రథాన్ని సందర్శకులు చూడవచ్చు.
  • ఉడిపి పర్యాయ ఉత్సవ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ప్రసిద్ధ పండుగ. పర్యాయ ఉత్సవ ఉడిపిలోని 8 మఠాలలో ఆలయ నిర్వహణను ఒక మఠం నుండి మరొక మఠానికి అప్పగించడాన్ని సూచిస్తుంది.
  • అన్నదాన: శ్రీకృష్ణ దేవాలయం ప్రతి భక్తునికి ఉచిత భోజనాన్ని అందిస్తుంది
  • గోశాల (ఆవు షెడ్)
  • ఆలయ రథం (బ్రహ్మ రథం)

దర్శన సమయాలు ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయం అన్ని రోజులలో ఉదయం 4.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది

సమీపంలో: మాల్పే, కాపు బీచ్, సెయింట్ మేరీస్ ద్వీపం ఉడిపి పట్టణానికి 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని ఆకర్షణలు.

ఎలా చేరుకోవాలి: ఉడిపి బెంగళూరు నుండి 400 కి.మీ. మంగళూరు సమీప విమానాశ్రయం (60 కి.మీ.). ఉడిపి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులతో రైలు మరియు రోడ్డు నెట్‌వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. శ్రీ కృష్ణ దేవాలయం ఉడిపి సిటీ సెంటర్ నుండి నడక దూరంలో ఉంది.

బస: ఉడిపి పట్టణంలో అనేక లగ్జరీ మరియు బడ్జెట్ వసతి అందుబాటులో ఉన్నాయి.






27, డిసెంబర్ 2024, శుక్రవారం

కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం

 

కోనసీమ



కోనసీమ ! మూడు వైపులా నీరు మధ్యలో గోదావరి డెల్టా ప్రాంతం !


కోనసీమ డెల్టా చుట్టూ, రెండు వైపులా గోదావరి పాయలైన వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు వున్నాయి. ఒక ప్రక్క సముద్రం ఉంది, రాజమండ్రి నగరాన్ని దాటిన తరువాత గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి పాయలుగా చీలుతుంది. వృద్ధ గోదావరి గౌతమి, నీలరేవుగా, వశిష్ట గోదావరి వశిష్ట, వైనతేయ గా చీలుతుంది. ఈ పాయలు బంగాళాఖాతం తీరంలో170 కి.మీ పొడవైన పరివాహక ప్రదేశాన్ని ఏర్పరుస్తాయి. దీనినే కోనసీమ ప్రాంతం అంటారు.


కోనసీమలో అమలాపురం అతి పెద్ద పట్టణం. దీని తరువాత స్థాయిలో రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం వున్నాయి.


ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' ! కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం.


కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. పచ్చని తీవాచీ పరిచినట్లుంటే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశిష్టంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది.


 కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి.


 ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. 


కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట. రాజమండ్రి కోనసీమకు పక్కనే పెద్ద నగరం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోనసీమ అందాలను, ఇక ఆలస్యం చేయకుండా కోనసీమ అందాలు తెలుసుకొందామా ..!


కోనసీమ అందాలు

మాటలకందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు ,పచ్చని చెట్ల తోరణాలు ,అరటి గెలలు, కొబ్బరి తోటలు , మంచు తెరలు మనోహర దృశ్యాలు, రంగవల్లులు కోడిపందాలు ,అంతర్వేదిలో గోదావరి సాగరసంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం. పచ్చని పంట పొలాలు... ఆకాశాన్ని తాకేలా పెరిగిన కొబ్బరిచెట్లు...పుష్కలమైన ప్రకృతివనరులు. కనుచూపు మేరకు తనివితీరని రమణీయమైన ప్రకృతి సౌందర్యం. ఇవన్నీ కోనసీమ అందాలు.


పంటపొలాలు

కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.


సంస్కృతి - సంప్రదాయాలు - పండుగలు


కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.


పలకరింపులు

కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! 


ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు. ఎవరు కనబడినా ఆప్యాయంగా పలకరించడం వారి సంస్కారం. ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో అని అడిగి తెలుసుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన గుణం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందర్నీ గౌరవంగా, ఆప్యాయంగా పలకరించే సంస్కారం వారి సొంతం


దేవాలయాలు


కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి 

1.మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి 

2.ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి

3. ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం 

4.పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం 

5.మందపల్లి లోని శనీశ్వర ఆలయం

6.అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి దేవాలయం

7. రాజోలు పట్టణ సమీపములో బి.సావరం(కస్తూరి వారి సావరం)

ఉమా సోమేశ్వర స్వామి క్షేత్రం 


ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి


రావులపాలెం

రావులపాలెం కోనసీమ అరటిపండ్ల మార్కెట్ కి ప్రధాన కేంద్రం. దీనిని కోనసీమకు ముఖద్వారం అని పిలుస్తారు.


అమలాపురం

అమలాపురం కోనసీమలో ప్రస్తుతం కోనసీమ జిల్లా కేంద్రం 


కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు . అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి.


కోనసీమ వంటలు

కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు.  అట్లు, మినపట్టు,పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.


గోదావరి అందాలు

గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.


పాపికొండల ప్రయాణం

కోనసీమ నుండి పాపికొండల ప్రయాణం అనుభూతి వర్ణించలేనిది. బిజీ లైఫ్ నుండి రిలీఫ్ కాలావనుకొనేవారికి ఈ ప్రయాణం అనుకూలం.


కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం పర్యాటకులను ఆకర్శించటానికి ఎన్నోయాత్రలను అందిస్తున్నది. పాపికొండలు, మారేడుమిల్లి, మంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడి సమీప అందాలు.ఇక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలను, వసతి కై రిసార్ట్ లు అనేకం కలవు.


సినిమా షూటింగ్లు

కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు.


కోనసీమ చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం : కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.


బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ బస్సు సర్వీసులు కలవు.


 రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. 

రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.


Credits : DrAyodhya Sarma Kasturi 

26, డిసెంబర్ 2024, గురువారం

శృంగార వల్లభ స్వామి దేవాలయం, తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్

 శృంగార వల్లభ స్వామి దేవాలయం, 

తోలి తిరుపతి, ఆంధ్రప్రదేశ్




శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ మరియు కాకినాడ నుండి ఉత్తరం వైపు 27 కి.మీ మరియు దివిలి నుండి ఒక కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని తొలి తిరుపతి (మొదటి తిరుపతి అని అర్ధం) అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఉన్న ఆలయం 9000 సంవత్సరాల పురాతనమైనది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న భగవాన్ బాలాజీ ఆలయం కంటే పురాతనమైనది. తోలి తిరుపతి గ్రామాన్ని చదలాడ (వాస్తవానికి చదలవాడ అని పిలుస్తారు) అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న భగవాన్ విష్ణు విగ్రహం వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో దర్శనమిస్తుంది కాబట్టి దీనికి శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చింది.

స్థల పురాణం

ఈ ఆలయ పురాణం విష్ణువు మరియు భాగవత పురాణాలలో ప్రస్తావించబడిన దృవానికి జోడించబడింది. ఉత్తానపాద రాజుకు ఇద్దరు భార్యలు సునీతి మరియు సురుచి. సునీతి కుమారుడు దృవుడు మరియు సురుచి కుమారుడు ఉత్తముడు.  సురుచి యవ్వనంగా మరియు చాలా అందంగా ఉంది మరియు ఆమె కుమారుడు ఉత్తముడు దృవుని కంటే చిన్నవాడు. సురుచి దృవుని చూసి అసూయపడి ఉత్తానపాదుడి తర్వాత తన కొడుకు ఉత్తముడిని రాజుగా చేయాలని కోరుకుంది. దృవుడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఒకరోజు, ఉత్తముడు తన తండ్రి ఒడిలో కూర్చోవడం చూసి, అతను కూడా కూర్చోవడానికి వెళ్తాడు. సురుచి దృవుడిని దూరంగా నెట్టివేసి, అతను తన కొడుకుగా పుట్టలేదు కాబట్టి, తన తండ్రికి దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. కలత చెందిన దృవ తన తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు. సునీతి దృవతో భగవాన్ విష్ణువు అత్యంత శక్తిమంతుడని మరియు భగవాన్ విష్ణువు యొక్క ఆశీర్వాదాలను పొందమని అతనికి సలహా ఇస్తుంది. దృవ భగవాన్ విష్ణు ఆశీస్సులు తీసుకోవడానికి బయలుదేరాడు. నారద ముని అతనిని చూసి, 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని జపించమని ధృవుడికి సలహా ఇస్తాడు. దృవుడు ఆరు నెలల పాటు తీవ్రమైన తపస్సు చేస్తాడు మరియు విష్ణువు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. దృవుడు అతని భారీ రూపం మరియు తేజస్సు కారణంగా విష్ణువును చూడలేకపోయాడు. ఇది గ్రహించిన భగవాన్ చిన్నపిల్లల పరిమాణానికి వచ్చి దృవుడిని చూడమని అడుగుతాడు. భగవాన్ తనను చూడాలనుకునేవారి పరిమాణంలో ఉంటానని ఆశీర్వదిస్తాడు. భగవాన్ విష్ణువు ధృవుడిని అనుగ్రహించిన ప్రదేశం తొలి తిరుప్తి అని నమ్ముతారు.

ఈ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పంలో తూర్పు చాళుక్యులు (7వ మరియు 12వ శతాబ్దాల మధ్య పాలించినవారు) నిర్మించారు. ప్రధాన విగ్రహం లేదా మూల విరాట్ అనేది శృంగార వల్లభ స్వామి రూపంలో ఉన్న భగవాన్ విష్ణువు అతని భార్యలు శ్రీ దేవి మరియు భూ దేవి.  ప్రవేశద్వారం వద్ద శేషతల్పంపై విష్ణువు లక్ష్మీదేవి, బ్రహ్మ మరియు నారదులతో కనిపిస్తారు. ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా మండపం ఉంది. గర్భగృహ (అభయారణ్యం) చేరుకోవడానికి 7 ద్వారములు (ప్రవేశాలు) ఉన్నాయి. 
మొదటి మరియు రెండవ ద్వారం దాటిన తర్వాత ద్వాజస్తంభం ఉన్న బయటి ప్రాకారంలోకి వస్తారు. మూర్తి యొక్క అసలు పరిమాణంతో సంబంధం లేకుండా, యాత్రికుడు ద్వజస్తంభం వద్ద నిలబడితే (అంతేకాక, గర్భాలయానికి ప్రధాన ద్వారం వద్ద ఆలయం లోపల కమలం గుర్తుతో గుర్తించబడిన నిర్దిష్ట స్థానం నుండి చూసినప్పుడు), ప్రధాన విగ్రహం అదే విధంగా కనిపిస్తుంది. వీక్షకుడి ఎత్తు (యాత్రికుడి ఎత్తుతో సంబంధం లేకుండా). ఇది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఆలయం వద్ద ఉన్న స్తంభాలపై పురాతన శాసనాలు ఉన్నాయి. తిరుపతికి చెందిన భగవాన్ బాలాజీతో పోల్చి చూస్తే, ఈ ఆలయంలో దేవతపై శంఖం మరియు చక్రం మార్చబడిన స్థానాల్లో ఉన్నాయి. భగవాన్ అవతరించిన తరువాత, దేవతలు ఆలయాన్ని నిర్మించారని మరియు నారద మహర్షి లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. తరువాతి సంవత్సరాలలో, శ్రీ కృష్ణ దేవరాయ చక్రవర్తి తన పర్యటన సందర్భంగా భూదేవి దేవత యొక్క రాగి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. 
చక్రవర్తులు భోజ మహారాజ్, విక్రమార్క మరియు కాకతీయ రాణి రుద్రమ దేవి మరియు అనేక మంది రాజులు ఈ ఆలయాన్ని సందర్శించారని కూడా చెబుతారు. ఆలయ ఆవరణలో ఉన్న బావి వేసవిలో కూడా నీటితో నిండి ఉంటుంది మరియు ఎప్పటికీ ఎండిపోదు. ప్రతి సంవత్సరం చైత్ర సుద్ద ఏకాదశి నాడు భగవాన్ కల్యాణం నిర్వహిస్తారు మరియు ఆ తర్వాత ఆరు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. 
ఒక నక్షత్ర మండపం ఉంది, ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు (మొత్తం 27 నక్షత్రాలు) గర్భాలయానికి ఉత్తరం వైపున, బావికి ఆనుకుని ఉంది.  క్వీన్ విక్టోరియా ఈ ఆలయాన్ని సందర్శించి భగవాన్‌కు వెండి కవచాన్ని సమర్పించిందని చెబుతారు. ఆళ్వార్లకు ప్రత్యేక విగ్రహాలు ఉన్నాయి (ఆళ్వార్లు తమిళ కవి - భగవాన్ విష్ణువు పట్ల భక్తిని చాటుకున్న సాధువులు మరియు భగవాన్ విష్ణువును కీర్తిస్తూ కీర్తనలు పాడారు. దివ్య ప్రబంధం వలె) భక్తి ఉద్యమం వెనుక ఉత్ప్రేరకాలుగా పరిగణించబడ్డారు. ఆళ్వార్లు 5వ శతాబ్దం మరియు 9వ శతాబ్దం CE మధ్య జీవించారు. సాధారణంగా భగవాన్ విష్ణువు యొక్క అవతారం స్వయంభూ (స్వయంగా) ఉన్న వైష్ణవ దేవాలయాలలో ఆళ్వార్ల విగ్రహాలు కనిపిస్తాయి.   
భగవాన్ శివుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు మరియు శివాలయం ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉంది.

తిరుపతి శృంగార వల్లభ ఆలయానికి ఎలా చేరుకోవాలి:

రైలు మార్గం: 
తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయం చుట్టూ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి మరియు అవి సామర్లకోట జంక్షన్ 14 కి.మీ, పెద్దాపురం 14 కి.మీ మరియు కాకినాడ 28 కి.మీ. 
రోడ్డు మార్గం: 
తిరుపతి చుట్టూ 3 ప్రధాన బస్ స్టేషన్లు ఉన్నాయి. వల్లభ స్వామి దేవాలయం - పెద్దాపురం 11 కి.మీ, సామర్లకోట 14 కి.మీ మరియు కాకినాడ 28 కి.మీ. 
విమాన మార్గం: 
రాజమండ్రి విమానాశ్రయం, 50 కి.మీ, విశాఖపట్నం విమానాశ్రయం, 152 కి.మీ మరియు విజయవాడ విమానాశ్రయం (గన్నవరం), 184 కి.మీ.

19, డిసెంబర్ 2024, గురువారం

తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!

 


తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!
🌿ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు.
🌸 స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు.
🌿పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
🌸రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ, శ్రీ వేంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మ్రొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వేంకటేశ్వరస్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా
🌿 తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతి పాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసున్ని దర్సించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి.
🌸ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంతసేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీస్వామివారి వక్ష స్థలంలోను, భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోను దాక్కొన్నారట. వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యం అంతా ఇంతా కాదు.
🌿ఆ తర్వాత భగవద్రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థంమనెడి బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగి కొనుట అనెడి పురాణ ప్రవచనాన్ని బట్టి, ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి, తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని,
🌸 అంతే కాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది.
🌿అప్పటి నుంచి నిత్యమూ పుష్పాంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీతీర్థం రోజున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామర బాజాభజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష, గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
🌸అదేరోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది.
🌿అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.
🌸ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది.
🌿ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్రామానుజల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటోంది ఈ పూల బావి ఎంతో గొప్పది కదా.!.
🌹ఓం నమో వెంకటేశాయ 🌹

18, డిసెంబర్ 2024, బుధవారం

బిల్వపత్రం విశిష్టత

 

బిల్వపత్రం విశిష్టత..........!!
త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మపాప సంహారం - ఏకబిల్వం శివార్పణం
ఈ శ్లోకం శివస్తుతిలో బహుళప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమపవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడుదళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. కోటి ఏనుగుల దానఫలం, నూరు యజ్ఞాలఫలం, కోటి కన్యాదానాలవల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని సకల పాపాల నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివరపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతిదేవికి కనిపించిందట. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోం తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీ దేవి అడిగిందట.
అందుకు బిల్వపత్రం నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను.. ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటినుంచి శివస్తుతి, శివారాధనపూజకు తప్పనిసరి అయింది బిల్వపత్రం. పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడువృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడువృక్షం పరమశివునికి ప్రీతికరం.
ఈ బిల్వపత్రాలను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు. ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం.
సుప్రసిద్ధమైన బిల్వాష్టకం, బిల్వపత్రాల గొప్పదనాన్ని విస్తారంగా పోగొడుతుంది. బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? సాధారణంగా, ఈ చెట్టు కొన్ని శతాబ్దాలగా పవిత్రమైనదిగా పరిగణింపబడుతూ వచ్చిందని, బిల్వ పత్రాలు లేనిదే శివునికి అర్పించే అర్పణలు సంపూర్ణం కావని మనకి తెలుసు. ఈ పత్రాలకు అనేక రకాల ఉపమానాలు ఆపాదించబడతాయి: ఈ త్రిపత్రాలు అనేక రకాల త్రిత్వాలను సూచిస్తాయి అంటారు - సృష్టి, స్థితి, ఇంకా లయ; లేదా సాత్వికం, రాజసం ఇంకా తామసం అనే త్రిగుణాలను; లేదా శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారం లోని మూడక్షరాలను సూచిస్తాయంటారు. ఈ మూడు పత్రాలు, మహాదేవుని మూడు కళ్ళను, లేదా అతని ప్రతీకాత్మక ఆయుధం అయిన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు.
శివారాధనలో బిల్వపత్రి గురించి విశ్లేషిస్తే లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల పుట్టినది బిల్వవృక్షం. అందుకే లక్ష్మీ దేవి ఎప్పుడూ బిలవృక్షంలో నివాసం ఉంటుందని అంటారు. ఇకపోతే ఈ మూడు ఆకులు కలిపి బిల్వదళంగా పేర్కొనే వాటిని మనిషిలో ఉండే సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. అంటే ఈ బిల్వ దళాన్ని ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంచడం అంటే మనిషిలోని ఆ మూడు గుణాలను ఆయన ముందు వదలడం. ఈ మూడు గుణాల చర్యలే మనిషిని నడిపిస్తున్నపుడు ఆ మూడింటిని ఆయన దగ్గర ధారపోసి వాటిని సరిచేసుకోవడమనే కోణంలో కూడా సారాంశం వస్తుంది.
ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహాలలోకెళ్లా శక్తివంతమైన శనిదేవుడికి ఒక వరం ఇచ్చాడు. బిల్వవృక్షంలో తనను పట్టివుంచినందుకు కానూ ఆయన్ను శనీశ్వరుడిగా మార్చాడు. అంతేకాదు బిల్వపత్రి దళాలతో ఆ శివుడిని పూజించేవారికి శనిదేవుడి తాలూకూ బాధలు ఉండవని కూడా చెప్పాడు. అందుకే శని దోషం ఉందని ఎవరికైనా అనిపిస్తే నీళ్లు, బిల్వపత్రాలు, విభూతి ఇట్లా అన్నిటినీ మేళవించి రుద్రాభిషేకాన్ని జరిపిస్తారు. లేదంటే శివుడికి బిల్వపత్రార్చన జరుపుతారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ సృష్టిలోని సకల లోకాలలోని పుణ్యక్షేత్రాలు అన్ని కూడా కేవలం బిల్వవృక్షంలో ఉంటాయని అంటే అన్ని పుణ్యాక్షత్రాలు, అంతమంది దేవుళ్ళ స్వరూపాలతో బిల్వవృక్షం సమానమని చెబుతారు.
వంశం అభివృద్ధి చెందకుండా ఉన్నపుడు బిల్వవృక్షం యొక్క మూలన్ని గంధం, పుష్పాలు, అక్షింతలతో పూజిస్తే వారి వంశం అభివృద్హి చెందుతుంది.
బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెడితే అలా దీపాలు పెట్టినవాళ్లకు ఆ పరమేశ్వరుడి కృప దక్కుతుంది. ఆ శివజ్ఞానం సిద్ధిస్తుంది.
బిల్వవృక్షం మొదలులో ఎవరికైనా భోజనం పెడితే కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణకథనాలు.
అలాగే బిల్వచెట్టు దగ్గర ఎవరైనా శివభక్తుడికి నెయ్యి, పాలన్నము దానం చేస్తే అలా దానం చేసిన వారికి దరిద్రం తొలగిపోయి ఆర్థికసమస్యలు, మానసిక, శారీరక సమస్యలు తీరుతాయి.
ఓ రకమైన ఆకుని మరో దాని కంటే పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఇదొక విధమైన పక్షపాతమా? మొత్తం మీద ప్రతిదీ కూడా మట్టిలో నుండే వస్తుంది. వేపకాయ ఇంకా మామామిడి కాయ, రెండూ కూడా అదే మట్టిలో నుండి వస్తాయి, కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి, ఉంటాయా లేదా? అదే మట్టిని ఓ జీవం ఏ విధంగా పరివర్తన చేస్తుంది అనేది మరొక జీవం దాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది అన్న దానికి భిన్నంగా ఉంటుంది. ఓ పురుగుకీ, కీటకానికి మధ్య తేడా ఏంటి, అలాగే మీకూ ఇంకా మరో మనిషికీ మధ్య తేడా ఏంటి? పదార్థం ఒక్కటే, దాని నుంచి మనం ఏం తయారు చేస్తామన్నదే ఇక్కడ తేడా.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లు సాధ్యమైన అన్ని విధాల సహకారాన్నీ తీసుకోవాలని చూస్తుంటారు, ఎందుకంటే అది తెలీని ప్రదేశం. భారతీయ సంస్కృతిలో, గమనించడం ద్వారా ఇంకా ధ్యానం ద్వారా, మనకు సహకరించగల ప్రతీ దాన్నీ గుర్తించడం జరిగింది. వాళ్లు ఆఖరికి పువ్వులను పళ్ళను ఇంకా ఆకులను కూడా వదిలిపెట్టలేదు. మరి ప్రత్యేకించి బిల్వ పత్రాన్ని పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఎప్పుడూ కూడా, బిల్వపత్రం శివునికి ప్రియమైనదని చెబుతారు. దానర్థం శివునికి బిల్వ పత్రం అంటే ప్రీతి అని కాదు. ఆయనకు దాని అవసరం ఏముంది? మనమది శివునికి ప్రియమైనదన్నప్పుడు, దానర్థం ఏంటంటే ఓ విధంగా మనం దేన్నయితే శివ అంటామో, ఈ బిల్వపత్రం యొక్క ప్రకంపనలు దానికి దగ్గరగా ఉన్నాయి అని అర్ధం.
ఇలాంటి ఎన్నో పదార్థాలు మనం గుర్తించాం, అలాగే వాటిని మాత్రమే సమర్పిస్తాం, ఎందుకంటే ఆ(దైవం) స్పర్శ లోనికి వచ్చేందుకు అవి మనకు మాధ్యమాలవుతాయి. మీరు శివునికి బిల్వ పత్రాలు సమర్పించినప్పుడు, దాన్ని ఆయన వద్ద ఉంచేసి వెళ్ళరు. అర్పించిన తర్వాత మీరు దాన్ని మీతో పాటు తీసుకువెళ్లాలి. దాన్ని లింగంపై ఉంచి, ఆ తర్వాత మీరు తీసుకుంటే, ఆ ప్రకంపనలను చాలా కాలం పాటు పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో ఉంటుంది. మీరిది ప్రయత్నించి చూడొచ్చు: ఓ బిల్వపత్రాన్ని సమర్పించి, దాన్ని మీ షర్టు జేబులో పెట్టుకుని ఉంచండి. అది ఆరోగ్య పరంగా, శ్రేయస్సు పరంగా, మానసిక స్థితి పరంగా, అన్ని విధాలుగా ఎంతో మార్పు తెస్తుంది.
బిల్వ పత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులే కాదు,.కాండం, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి.
ప్రయోజనాలు మెండు
మారేడులో మినరల్స్‌, విటమిన్లు అధికంగా ఉంటాయి. కెరోటిన్‌, విటమిన్‌ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి.
విరేచనాలు, మలబద్ధకం, జలుబు, ఆయాసం లాంటి సమస్యల నివారణకు బిల్వ ఫలం బాగా ఉపయోగపడుతుంది.
ఫైల్స్‌ సమస్య ఉన్నవారు మెంతిపొడితో కలిపి తీసుకోవాలి.
ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున కాషాయంగా చేసి తీసుకుంటే అనేక రోగాలకు దివ్యౌషధంగా చెబుతారు. దగ్గు, జ్వరం తగ్గించడానికి బాగా పని చేస్తుంది.
గర్భిణులకు వచ్చే ఒళ్లు నొప్పుల నివారణకు మారేడు ఆకులను వేడినీటిలో వేసి స్నానం చేయాలి.

గంగతో సమానమైన దధీచి కుండం

 


గంగతో సమానమైన దధీచి కుండం- జీవితంలో ఒక్కసారైనా అందులో స్నానం చేయాల్సిందే!

88వేల నదుల్లో స్నానమాచరించే ఫలితం- సకల పాపాలను పోగొట్టే దధీచి కుండం విశిష్టత తెలుసా?

వ్యాస మహర్షి చెప్పినట్లుగా కృతయుగం తో సమానమైన యుగం కానీ, వేదం తో సమానమైన శాస్త్రం కానీ, కార్తిక మాసంతో సమానమైన మాసం కానీ, గంగా తీర్థం తో సమానమైన తీర్థం కానీ లేదని అంటారు. అలాంటి పరమ పావనమైన గంగానదిలో సమానమైన తీర్థం మన దేశంలో ఎక్కడుందో తెలుసా! కేవలం స్పర్శతోనే సమస్త పాపాలు నశింపజేసే ఆ తీర్థ రాజం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దధీచి కుండం విశిష్టత

ఉత్తర్ప్రదేశ్లోని నైమిశారణ్యం పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలో ఋషులు, మునులను తపస్సు చేసుకోవాలని ఆదేశించినట్లుగా స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ద్వారా తెలుస్తోంది. ఇంతటి పావన ప్రదేశమైన నైమిశారణ్యంలో దధీచి కుండం ఉంది. ఈ దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని, సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్ర వచనం. దధీచి కుండానికి ఇంతటి మహత్యం ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పౌరాణిక గాధ ఏమిటి?ఘనత వహించిన మన మహర్షులు

మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే దేశ సుభిక్షానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహనీయుల గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.ఎవరీ దధీచి?

దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. దధీచి విష్ణువుని ప్రసన్నం చేసుకుని తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించేలా వరాన్ని పొందుతాడు.సురాసురుల యుద్ధం

ఒకసారి రాక్షసులు వృతాసురుని ఆధ్వర్యంలో స్వర్గాధిపతి ఇంద్రునిపై యుద్ధానికి వెళ్లారు. దేవతల వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో వారు చేసిన ఈ భీకర యుద్ధంలో వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటకి పరుగులు తీసి దధీచి దగ్గరకు వచ్చి వారి అస్త్రశస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు తిరిగి పరుగులు తీస్తారు. దధీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు.


అస్త్రశస్త్రాలను అవపోసిన పట్టేసిన దధీచి

దధీచి మహర్షి దేవతలు వచ్చి వారి అస్త్రశస్త్రాలను తిరిగి తీసుకెళ్తారని ఎంతో కాలం ఎదురుచూసి వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే అవపోసన పట్టేస్తారు.శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన ఇంద్రాది దేవతలు.ఆదిత్యయోగీ.

వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువుని కోరుతారు. దానికి విష్ణుమూర్తి దధీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెపుతారు.దధీచిని వేడుకున్న దేవతలు

దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ల కోరికను విన్నవించుకున్నారు. దధీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ల కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దధీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు. అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.దధీచి కుండం ఇలా ఏర్పడింది!

లోక కల్యాణం కోసం దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధపడిన సమయంలో ఆయన కోరిక మేరకు ఇంద్రాది దేవతలు 88 వేల నదీ జలాలతో ఆయనకు స్నానం చేయించారు. అలా ఆయనకు స్నానం చేయించిన నీటితో ఏర్పడినదే 'దధీచి కుండం'.పాపనాశిని దధీచి కుండం

నైమిశారణ్యం వెళ్లినవారు ఈ కుండంలోని నీటిని 'గంగతో సమానమైనవిగా భావిస్తుంటారు. దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని అంటారు. మనం కూడా జీవితంలో ఒక్కసారైనా నైమిశారణ్యం వెళ్లి దధీచి కుండం లోని నీటి స్పర్శతో పావనమవుదాం. 

పళని మురుగన్‌ మహత్యం

 

పళని మురుగన్‌ మహత్యం

అంతుబట్టని నవ పాషాణం!


అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.


వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.




సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.


నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్‌ పెరుమాళ్‌ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.


నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్‌ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.


మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్‌ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. 


"అన్నీ వదిలేసి నన్ను చేరుకో" 

అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్‌, శరవణన్‌... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.


"స్థలపురాణం"

ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.


కావడీ ఉత్సవం!

దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.


ఏమిటీ నవ పాషాణం!

పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.


దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్‌" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్‌ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm


"ఎవరీ సిద్ధ భోగర్‌?"

క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్‌ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్‌ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్‌ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్‌ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్‌ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్‌ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్‌ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.


తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్‌ ఒకరు. గురువైన కాలంగి నాథర్‌ చివరి కోరిక మేరకు భోగర్‌ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్‌ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు. 


అందుకే... పళని మురుగన్‌ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!


పంచామృతం!

లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*






సూర్యదేవాలయం - గొల్లల మామిడాల

 


 సూర్యదేవాలయం - గొల్లల మామిడాల


కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.


మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి.అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగాఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి


.దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది.రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.


వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు,కాలువలు,కాకినాడ ప్రాంతం,ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ....


ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు.ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.....


ఆలయానికి చేరుకొనే మార్గం :


   మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంల ఉంటుంది.కాకినాడ,రాజమండ్రి,

సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు...

శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం

 "పాతాళ సెంబు మురుగన్ దేవాలయంలోని స్వామిని దర్శించిన పిమ్మట, అక్కడ 41 రోజులపాటు స్వామి మీద వేసి ఉంచి, అభిషేకించిన కరుంగళి మాలలకే శక్తి వస్తుంది. వాటిని ధరించిన వారికే ఫలితం ఉంటుందని సిద్దార్ భోగర్ వరమిచ్చాడు" అనేది ఆలయ ప్రాశస్త్యం.






అసలు కథలోకి వెళ్తే...


రామలింగంపట్టి శ్రీ పాతాల సెంబు మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్‌లోని రామలింగపట్టిలోని భోగర్ నగర్‌లో ఉంది. ఇక్కడి ప్రధాన దైవం మురుగన్. ఇక్కడ పాతాల సెంబు మురుగన్ అని పిలుస్తారు. పళని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని పశ్చిమ కనుమల పర్వతాలు మరియు దేవర్మలై చుట్టుముట్టాయి. ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపలికి 16 అడుగుల గుహలో ఉంది అందుకే పాతాళ (భూగర్భ) సెంబు (రాగి) మురుగన్ అనే పేరు వచ్చింది అంటారు. భూగర్భ గర్భాలయానికి చేరుకోవడానికి భక్తులు 18 మెట్లు దిగాలి. ఈ "పాతాళ సెంబు" అనే పదానికి "బంగారు మురుగన్" అని మరొక అర్ధం కూడా ఉందని అంటారు. ఈ రూపాన్ని శ్రేయస్సు మరియు రక్షణ కోసం పూజిస్తారు. భూగర్భ గుహలో నిలుచుని స్థితిలో ఉన్న మురుగన్ కుడిచేతి అభయ ముద్రను ప్రదర్శిస్తుంది మరియు ఎడమ చేతిలో వేల్ (ఈటె) ఉంటుంది.


పురాణాల ప్రకారం, సిద్ధ సాధువు, బోగర్, భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవపాషణం ఉపయోగించి పళనిలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడు. భోగరుడు సప్తఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి శిష్యుడు. పూర్వానికి తిరుకోవిలూర్ సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు, ఇతను భోగరుడి అవతారంగా భావించబడతాడు. తిరుకోవిలూర్ సిద్ధార్ ఈ క్షేత్రంలో మురుగ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఇక్కడ ఆయనకు పూజలు చేశారు.


1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంది. ఈ దేవాలయం సుప్రసిద్ధ పరిహార స్థలం. ఎంతోమంది భక్తులు తమ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి నివారణల కోసం ఇక్కడకు వస్తారు. ఇక్కడి మురుగన్ దేవతా ప్రతిమ నవపాషణంతో తయారు చేయబడింది. ఇది 5 లోహాలను కలిగి ఉంటుంది - బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం. భూగర్భ గుహలో ఉన్న విగ్రహానికి ప్రతిరోజూ అభిషేకం చేస్తారు. రామనాథపురం సంస్థానానికి చెందిన రాజు భాస్కర సేతుపతి వంశస్థుడైన గంధమారన్ విగ్రహం యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు 


పవిత్రమైన విభూతి ఆలయంలో ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ సువాసనగల విభూతి 18 రకాల మూలికలతో తయారు చేయబడిందని, వివిధ రకాల వ్యాధులను నయం చేయగలదని భక్తుల విశ్వాసం. ఇందులో దైవీ గుణాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు.


ఇక్కడి ప్రత్యేకత ఏమంటే భూగృహలో ఉన్న మురుగన్ ప్రతిమ మీద మరియు పాదాల వద్ద ఉంచి అభిషేకించిన కరుంగళి మాలలను భక్తులు అత్యంత విశ్వాసంతో, భక్తి శ్రద్దలతో ధరిస్తారు. ఈ కరుంగళి మాల ధరించడం వల్ల ఆ వ్యక్తి యొక్క నెగటివ్ పవర్ తొలగిపోతుందని విశ్వాసం. ప్రతికూల ప్రభావాలను పరిష్కరించగలవని, మంచి ఆరోగ్యం మరియు సంపదను తీసుకురాగలవని మరియు ప్రతికూల శక్తులను తిప్పికొట్టగలవని, వివాహంలో జాప్యం, సంతానలేమి, శత్రువులపై విజయం, వృత్తిలో రాణించడం, రాహు, కేతు మరియు కుజ దోషాల నుండి ఉపశమనం, భూమి మరియు ఆస్తి తగాదాల పరిష్కారం, విద్య, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.


#అరుణాచలశివ 🙏

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...