పళని మురుగన్ మహత్యం
పళని మురుగన్ మహత్యం అంతుబట్టని నవ పాషాణం! అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు. వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది. నిజాన...