lord లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
lord లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

 



తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం.


🌿ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం.



🌸మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


🌿మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


🌸నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.


🌿18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


🌸ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


🌿నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


🌸స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


🌿కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


🌸స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది.


🌿స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


🌸అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


🌿ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు.


🌸రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


🌿స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.. సేకరణ... స్వస్తి...🚩🌞🙏🌹🎻

ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!

 



ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. 

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. 

ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. 

ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.

ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. 

అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. 

ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. 

నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. 

నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 

అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు.

 ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. 

అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది.

 నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. 

అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. 

వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. 

పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. 

అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. 

ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. 

చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 

స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. 

ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి.

 అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. 

శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. 

బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు.

అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. 

ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 

ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. 

ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. 

వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు.

 మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. 

కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. 

పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. 

ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది.


మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది.


నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. 

వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు.


ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. 

తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. 

ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 

మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు.

 శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. 

వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

శ్రీ మధ్వాచార్యులు శ్రీకృష్ణుని మఠంలో పూజించడం ప్రారంభించారు మరియు అష్ట మఠాల (ఎనిమిది మఠాలు) స్వామీజీ ద్వారా శ్రీకృష్ణుని పూజించే "పర్యాయ" విధానాన్ని ప్రారంభించారు. విగ్రహాన్ని తాకి పూజించే హక్కు శ్రీ మధ్వాచార్యుల ఆధ్యాత్మిక వారసులైన ఎనిమిది మఠాల పీఠాధిపతులపై ఉంటుంది. ఎనిమిది మఠాలకు చెందిన స్వామీజీలు ఒక్కొక్కరు రెండేళ్లపాటు శ్రీకృష్ణ మఠంలో పూజలు నిర్వహిస్తారు. భ్రమణం ద్వారా చేసే ఈ కాలాన్ని "పర్యాయ" అంటారు. ఏ సమయంలోనైనా ఆరాధనకు బాధ్యత వహించే స్వామీజీని 'పర్యాయ స్వామీజీ' అని పిలుస్తారు మరియు అతని మఠాన్ని 'పర్యాయ మఠం' అని పిలుస్తారు. ఎనిమిది పర్యాయ మఠాలు సోడే మఠం, పెజ్వర్ మఠం, పుట్టిగే మఠం, అద్మార్ మఠం, కనియూర్ మఠం, పలిమారు మఠం, షిరూర్ మఠం మరియు కృష్ణపుర మఠం. ప్రస్తుత పర్యాయ స్వామీజీ శ్రీ సోధే మఠానికి చెందిన “శ్రీ విశ్వవల్లభ తీర్థ స్వామీజీ”.

ఉడిపిలో చంద్రమౌళీశ్వర మరియు అనాథేశ్వర ఆలయాలు అనే రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి. శివుడు లింగ రూపంలో కనిపించి వెండి పీఠాన్ని ఆక్రమించి ఇక్కడ అనంతేశ్వరుడిగా ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. శాపం నుండి విముక్తి కోసం చంద్రుడు 'చంద్ర పుష్కరిణి' అనే పవిత్ర చెరువు ఒడ్డున ఉన్న శివుడిని పూజించాడు. అతని పూజలకు శివుడు సంతోషించి చంద్రునికి ప్రత్యక్షమై శాపవిమోచనం చేసాడు.అందుకే శివుడిని చంద్రమౌళీశ్వరుడు అని పిలుస్తారు మరియు ఈ ప్రదేశంలో చంద్రమౌళీశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది. పురాతన కాలంలో ఉడిపిని శివల్లి లేదా శివ-బెల్లి లేదా రజతపీఠ పుర అని పిలిచేవారు. పరశురాముని యొక్క గొప్ప భక్తుడైన రామభోజుడు పరశురామ క్షేత్రానికి రాజుగా ప్రకటించబడినందున ఈ ప్రదేశం రజతపీఠ పుటగా పిలువబడింది. మహాయజ్ఞం చేయాలనే ఉద్దేశ్యంతో యజ్ఞస్థలం దున్నుతుండగా ఒక పాము చంపబడింది.సర్ప దోషం (పామును చంపిన పాపం) నుండి తనను తాను విముక్తి చేసుకోవడానికి, దానిపై పాము చిత్రాలతో చెక్కబడిన వెండి పీఠాన్ని (రజత పీఠం) తయారు చేయమని రామబోజ రాజును పరశురాముడు ఆదేశించాడు.దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి కోసం శివుడిని తపస్సు చేసిన చంద్రుడు చంద్రుడి పేరు మీద రాజతపీఠ పురా అని పేరు పెట్టారు..సంస్కృతంలో ఉడు అంటే `నక్షత్రం’ మరియు ప అంటే `నాయకుడు’. చంద్రుడు నక్షత్రాలకు అధిపతి కావడంతో ఆ ప్రాంతానికి `ఉడిపి` అని పేరు వచ్చింది.


ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం విశేషాలు

  • కనకన కిండి: కృష్ణ దర్శనం నవగ్రహ కిండి ద్వారా జరుగుతుంది, కిండి వెనుక ఉన్న పురాణం 16వ శతాబ్దపు కనకదాసు మరియు శ్రీ కృష్ణుని శిష్యుడు శ్రీకృష్ణుని ఆరాధించడానికి ఉడిపికి వచ్చాడు. కానీ అతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి మఠం లోపలికి అనుమతించబడలేదు మరియు అతను దొంగతనానికి పాల్పడ్డాడని భావించి మఠం వెనుక ఉన్న స్తంభానికి కట్టివేయబడింది. కనకదాసు ఆరాధనకు సంతసించిన శ్రీకృష్ణుడు మఠం వెనుక గోడకు చిన్న రంధ్రం చేసి కనకదాసుకు దర్శనమిచ్చి, కనకదాసుకు కనిపించేలా రంధ్రం వైపుకు తిప్పాడు. ఈ రంధ్రాన్ని కనకన కింది అని పిలుస్తారు.


  • ఆలయ స్వర్ణ రథాన్ని సందర్శకులు చూడవచ్చు.
  • ఉడిపి పర్యాయ ఉత్సవ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ప్రసిద్ధ పండుగ. పర్యాయ ఉత్సవ ఉడిపిలోని 8 మఠాలలో ఆలయ నిర్వహణను ఒక మఠం నుండి మరొక మఠానికి అప్పగించడాన్ని సూచిస్తుంది.
  • అన్నదాన: శ్రీకృష్ణ దేవాలయం ప్రతి భక్తునికి ఉచిత భోజనాన్ని అందిస్తుంది
  • గోశాల (ఆవు షెడ్)
  • ఆలయ రథం (బ్రహ్మ రథం)

దర్శన సమయాలు ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయం అన్ని రోజులలో ఉదయం 4.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది

సమీపంలో: మాల్పే, కాపు బీచ్, సెయింట్ మేరీస్ ద్వీపం ఉడిపి పట్టణానికి 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని ఆకర్షణలు.

ఎలా చేరుకోవాలి: ఉడిపి బెంగళూరు నుండి 400 కి.మీ. మంగళూరు సమీప విమానాశ్రయం (60 కి.మీ.). ఉడిపి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులతో రైలు మరియు రోడ్డు నెట్‌వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. శ్రీ కృష్ణ దేవాలయం ఉడిపి సిటీ సెంటర్ నుండి నడక దూరంలో ఉంది.

బస: ఉడిపి పట్టణంలో అనేక లగ్జరీ మరియు బడ్జెట్ వసతి అందుబాటులో ఉన్నాయి.






19, డిసెంబర్ 2024, గురువారం

తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!

 


తిరుమల శ్రీవారి ఆలయంలో అతిపెద్ద పూలబావి..!!
🌿ఆపద మ్రొక్కులవాడు కొలువై ఉన్న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అతి పెద్ద బావి ఉంది. స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు.
🌸 స్వామివారికి అలంకరించిన తులసి, పుష్పం, పూలమాలలు ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఆలయంలోని బావిలో వేస్తారు. ఈ బావినే పూలబావి అంటారు.
🌿పూల బావికి మరో పేరుంది. అదే భూతీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. అనంతరం శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తులు ఒక బావిని తవ్వగా భూ తీర్థం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
🌸రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ, శ్రీ వేంకటేశ్వరుని పూజకై సంపెంగ చేమంతుల మ్రొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వేంకటేశ్వరస్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా
🌿 తొండమానుడు దానిని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రతి పాత్రుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసున్ని దర్సించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి.
🌸ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరుమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగు పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంతసేవ సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీస్వామివారి వక్ష స్థలంలోను, భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోను దాక్కొన్నారట. వరాహ పురాణాంతర్గత వేంకటాచల మహత్మ్యం అంతా ఇంతా కాదు.
🌿ఆ తర్వాత భగవద్రామానుజుల వారు తిరుమలకు వేంచేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థంమనెడి బావిని చూసి అందులో భూదేవి, శ్రీదేవి దాగి కొనుట అనెడి పురాణ ప్రవచనాన్ని బట్టి, ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్టించి, తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరుగుతున్నట్లు ఏర్పాటు చేశారని,
🌸 అంతే కాకుండా ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్లుగా నిర్ణయించారని శ్రీ వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది.
🌿అప్పటి నుంచి నిత్యమూ పుష్పాంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి, పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతోంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, అదీ తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరు పంచమీతీర్థం రోజున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకమలు, పరిమళ ద్రవ్యాలు, చీర, రవికలు, లడ్డూలు, వడలు తదితర ప్రసాదాలు ఛత్రచామర బాజాభజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష, గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
🌸అదేరోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తరువాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికీ జరుగుతూ ఉన్న సనాతన సాంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది.
🌿అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.
🌸ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. ఆ తరువాత కాలంలో చుట్టూ రాతి గోడతో ఈ బావి గుండ్రమైన చేదురుబావి వలె పునర్నిరమింపబడింది.
🌿ఇటీవల ఈ బావిపై ఇనుపకడ్డీల తడకను కప్పి వాటిపై పూల కుండీలను ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవి, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాను చక్రవర్తిని, భగవద్రామానుజల వారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటోంది ఈ పూల బావి ఎంతో గొప్పది కదా.!.
🌹ఓం నమో వెంకటేశాయ 🌹

18, డిసెంబర్ 2024, బుధవారం

ద్రాక్షారామం

 


తూర్పుగోదావరి జిల్లా.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో ఎంతో చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైంది ద్రాక్షారామం. ఇక్కడి భీమేశ్వరుడిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఓసారి వచ్చి చూడండి.

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి

ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం 70 అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది. 

భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పైఅంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది.

ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. సప్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.

ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు

వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి. ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ- ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని ఎలుగెత్తి ఘోషించే భక్తులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.

సూర్యదేవాలయం - గొల్లల మామిడాల

 


 సూర్యదేవాలయం - గొల్లల మామిడాల


కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.


మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి.అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగాఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి


.దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది.రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.


వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు,కాలువలు,కాకినాడ ప్రాంతం,ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ....


ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు.ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.....


ఆలయానికి చేరుకొనే మార్గం :


   మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంల ఉంటుంది.కాకినాడ,రాజమండ్రి,

సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు...

మన హిందూ ఆలయాలు వాటి విశిష్టత

 మన హిందూ ఆలయాలు వాటి విశిష్టత 



సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా 


నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు: 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా

9.అలంపురం


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు. 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.

శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

సముద్రమే వెనక్కివెళ్లే 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీవలె నెలసరి అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

ఁబహ్మ పేరు తో ఏకైక శివాలయాలు

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు

9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   


రంగులు మారే ఆలయం. 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


స్వయంభువుగా 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

ఆరునెలలకు ఒకసారి తెరిచే 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


12 ఏళ్లకు ఒకసారి

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.


స్వయంగా ప్రసాదం 

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


ఒంటి స్తంభంతో

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


రూపాలు మారే

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


మనిషి వలె గుటకలు  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి. 


ఛాయా విశేషం 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్


ఇంకా... 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc


పూరీ 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


ఇవి  తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు (సృష్టి చేశారు)విశ్వకర్మ పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు. .

💐💐💐🙏🙏🙏


✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు 🚩

12, డిసెంబర్ 2024, గురువారం

🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

 🌳గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి?

       


పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తనచేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. 


అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 


‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు.


’ఇంకెక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా!’ అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అందువల్ల ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. 


గణపతి పట్టువదల్లేదు.ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు.


ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. 


ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.


జయ గణేష పాహిమాం!  జయ గణేష రక్షమాం!!

తిరుమల వేంకటేశ్వర స్వామి ధృవబేరము

  తిరుమల  వేంకటేశ్వర స్వామి  ధృవబేరము 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరా...