బిల్వపత్రం విశిష్టత..........!!
త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మపాప సంహారం - ఏకబిల్వం శివార్పణం
ఈ శ్లోకం శివస్తుతిలో బహుళప్రాచుర్యం పొందింది. శివపురాణంలో బిల్వపత్రం విశిష్టత వివరించబడి ఉంది. పరమపవిత్రమైన ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడుదళం ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు. కోటి ఏనుగుల దానఫలం, నూరు యజ్ఞాలఫలం, కోటి కన్యాదానాలవల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని సకల పాపాల నివారణకు ఈ బిల్వపత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివరపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతిదేవికి కనిపించిందట. ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోం తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది నీ స్పర్శతో అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీ దేవి అడిగిందట.
అందుకు బిల్వపత్రం నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను.. ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ అని వేడుకొందట. అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట. అప్పటినుంచి శివస్తుతి, శివారాధనపూజకు తప్పనిసరి అయింది బిల్వపత్రం. పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడువృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడువృక్షం పరమశివునికి ప్రీతికరం.
ఈ బిల్వపత్రాలను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు. ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం.
సుప్రసిద్ధమైన బిల్వాష్టకం, బిల్వపత్రాల గొప్పదనాన్ని విస్తారంగా పోగొడుతుంది. బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? సాధారణంగా, ఈ చెట్టు కొన్ని శతాబ్దాలగా పవిత్రమైనదిగా పరిగణింపబడుతూ వచ్చిందని, బిల్వ పత్రాలు లేనిదే శివునికి అర్పించే అర్పణలు సంపూర్ణం కావని మనకి తెలుసు. ఈ పత్రాలకు అనేక రకాల ఉపమానాలు ఆపాదించబడతాయి: ఈ త్రిపత్రాలు అనేక రకాల త్రిత్వాలను సూచిస్తాయి అంటారు - సృష్టి, స్థితి, ఇంకా లయ; లేదా సాత్వికం, రాజసం ఇంకా తామసం అనే త్రిగుణాలను; లేదా శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారం లోని మూడక్షరాలను సూచిస్తాయంటారు. ఈ మూడు పత్రాలు, మహాదేవుని మూడు కళ్ళను, లేదా అతని ప్రతీకాత్మక ఆయుధం అయిన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు.
శివారాధనలో బిల్వపత్రి గురించి విశ్లేషిస్తే లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల పుట్టినది బిల్వవృక్షం. అందుకే లక్ష్మీ దేవి ఎప్పుడూ బిలవృక్షంలో నివాసం ఉంటుందని అంటారు. ఇకపోతే ఈ మూడు ఆకులు కలిపి బిల్వదళంగా పేర్కొనే వాటిని మనిషిలో ఉండే సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. అంటే ఈ బిల్వ దళాన్ని ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంచడం అంటే మనిషిలోని ఆ మూడు గుణాలను ఆయన ముందు వదలడం. ఈ మూడు గుణాల చర్యలే మనిషిని నడిపిస్తున్నపుడు ఆ మూడింటిని ఆయన దగ్గర ధారపోసి వాటిని సరిచేసుకోవడమనే కోణంలో కూడా సారాంశం వస్తుంది.
ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహాలలోకెళ్లా శక్తివంతమైన శనిదేవుడికి ఒక వరం ఇచ్చాడు. బిల్వవృక్షంలో తనను పట్టివుంచినందుకు కానూ ఆయన్ను శనీశ్వరుడిగా మార్చాడు. అంతేకాదు బిల్వపత్రి దళాలతో ఆ శివుడిని పూజించేవారికి శనిదేవుడి తాలూకూ బాధలు ఉండవని కూడా చెప్పాడు. అందుకే శని దోషం ఉందని ఎవరికైనా అనిపిస్తే నీళ్లు, బిల్వపత్రాలు, విభూతి ఇట్లా అన్నిటినీ మేళవించి రుద్రాభిషేకాన్ని జరిపిస్తారు. లేదంటే శివుడికి బిల్వపత్రార్చన జరుపుతారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ సృష్టిలోని సకల లోకాలలోని పుణ్యక్షేత్రాలు అన్ని కూడా కేవలం బిల్వవృక్షంలో ఉంటాయని అంటే అన్ని పుణ్యాక్షత్రాలు, అంతమంది దేవుళ్ళ స్వరూపాలతో బిల్వవృక్షం సమానమని చెబుతారు.
వంశం అభివృద్ధి చెందకుండా ఉన్నపుడు బిల్వవృక్షం యొక్క మూలన్ని గంధం, పుష్పాలు, అక్షింతలతో పూజిస్తే వారి వంశం అభివృద్హి చెందుతుంది.
బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెడితే అలా దీపాలు పెట్టినవాళ్లకు ఆ పరమేశ్వరుడి కృప దక్కుతుంది. ఆ శివజ్ఞానం సిద్ధిస్తుంది.
బిల్వవృక్షం మొదలులో ఎవరికైనా భోజనం పెడితే కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణకథనాలు.
అలాగే బిల్వచెట్టు దగ్గర ఎవరైనా శివభక్తుడికి నెయ్యి, పాలన్నము దానం చేస్తే అలా దానం చేసిన వారికి దరిద్రం తొలగిపోయి ఆర్థికసమస్యలు, మానసిక, శారీరక సమస్యలు తీరుతాయి.
ఓ రకమైన ఆకుని మరో దాని కంటే పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఇదొక విధమైన పక్షపాతమా? మొత్తం మీద ప్రతిదీ కూడా మట్టిలో నుండే వస్తుంది. వేపకాయ ఇంకా మామామిడి కాయ, రెండూ కూడా అదే మట్టిలో నుండి వస్తాయి, కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి, ఉంటాయా లేదా? అదే మట్టిని ఓ జీవం ఏ విధంగా పరివర్తన చేస్తుంది అనేది మరొక జీవం దాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది అన్న దానికి భిన్నంగా ఉంటుంది. ఓ పురుగుకీ, కీటకానికి మధ్య తేడా ఏంటి, అలాగే మీకూ ఇంకా మరో మనిషికీ మధ్య తేడా ఏంటి? పదార్థం ఒక్కటే, దాని నుంచి మనం ఏం తయారు చేస్తామన్నదే ఇక్కడ తేడా.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లు సాధ్యమైన అన్ని విధాల సహకారాన్నీ తీసుకోవాలని చూస్తుంటారు, ఎందుకంటే అది తెలీని ప్రదేశం. భారతీయ సంస్కృతిలో, గమనించడం ద్వారా ఇంకా ధ్యానం ద్వారా, మనకు సహకరించగల ప్రతీ దాన్నీ గుర్తించడం జరిగింది. వాళ్లు ఆఖరికి పువ్వులను పళ్ళను ఇంకా ఆకులను కూడా వదిలిపెట్టలేదు. మరి ప్రత్యేకించి బిల్వ పత్రాన్ని పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఎప్పుడూ కూడా, బిల్వపత్రం శివునికి ప్రియమైనదని చెబుతారు. దానర్థం శివునికి బిల్వ పత్రం అంటే ప్రీతి అని కాదు. ఆయనకు దాని అవసరం ఏముంది? మనమది శివునికి ప్రియమైనదన్నప్పుడు, దానర్థం ఏంటంటే ఓ విధంగా మనం దేన్నయితే శివ అంటామో, ఈ బిల్వపత్రం యొక్క ప్రకంపనలు దానికి దగ్గరగా ఉన్నాయి అని అర్ధం.
ఇలాంటి ఎన్నో పదార్థాలు మనం గుర్తించాం, అలాగే వాటిని మాత్రమే సమర్పిస్తాం, ఎందుకంటే ఆ(దైవం) స్పర్శ లోనికి వచ్చేందుకు అవి మనకు మాధ్యమాలవుతాయి. మీరు శివునికి బిల్వ పత్రాలు సమర్పించినప్పుడు, దాన్ని ఆయన వద్ద ఉంచేసి వెళ్ళరు. అర్పించిన తర్వాత మీరు దాన్ని మీతో పాటు తీసుకువెళ్లాలి. దాన్ని లింగంపై ఉంచి, ఆ తర్వాత మీరు తీసుకుంటే, ఆ ప్రకంపనలను చాలా కాలం పాటు పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో ఉంటుంది. మీరిది ప్రయత్నించి చూడొచ్చు: ఓ బిల్వపత్రాన్ని సమర్పించి, దాన్ని మీ షర్టు జేబులో పెట్టుకుని ఉంచండి. అది ఆరోగ్య పరంగా, శ్రేయస్సు పరంగా, మానసిక స్థితి పరంగా, అన్ని విధాలుగా ఎంతో మార్పు తెస్తుంది.
బిల్వ పత్రం ఎంతో మేలు చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఆకులే కాదు,.కాండం, కాయలు, పూలు, వేర్లు కూడా ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి.
ప్రయోజనాలు మెండు
మారేడులో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. కెరోటిన్, విటమిన్ బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.
విరేచనాలు, మలబద్ధకం, జలుబు, ఆయాసం లాంటి సమస్యల నివారణకు బిల్వ ఫలం బాగా ఉపయోగపడుతుంది.
ఫైల్స్ సమస్య ఉన్నవారు మెంతిపొడితో కలిపి తీసుకోవాలి.
ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున కాషాయంగా చేసి తీసుకుంటే అనేక రోగాలకు దివ్యౌషధంగా చెబుతారు. దగ్గు, జ్వరం తగ్గించడానికి బాగా పని చేస్తుంది.
గర్భిణులకు వచ్చే ఒళ్లు నొప్పుల నివారణకు మారేడు ఆకులను వేడినీటిలో వేసి స్నానం చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి