పళని మురుగన్ మహత్యం
అంతుబట్టని నవ పాషాణం!
అటు చరిత్రకీ ఇటు శాస్త్రీయతకీ అందని అసాధారణ నైపుణ్యానికీ విజ్ఞానానికీ చూడచక్కని ఆనవాళ్లు భారతీయ దేవాలయాలు.
వాస్తునిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే, మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటివాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం.
సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్య క్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నులపండువగా జరుగుతుంది. అందులో పాల్గొన్నవాళ్లకి సంతానప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.
నిరవధికంగా పదహారు గంటలపాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్నినక్షత్రం... ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేర రాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లూ ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లూ తెలుస్తోంది.
నిజానికి విగ్రహం క్రీ.పూ. మూడువేల సంవత్సరాలనాటిదనీ చాలాకాలం నిర్లక్ష్యానికి గురైందనీ, చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు.ఆదిత్యయోగీ.
మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండమీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతోపాటు రోప్ వే లాంటి సౌకర్యమూ ఉంది. గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకుని కౌపీనధారిగా దర్శనమిస్తాడు.
"అన్నీ వదిలేసి నన్ను చేరుకో"
అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాణి, బాల సుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణన్... ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు.
"స్థలపురాణం"
ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి, నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకుని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకూ అధిపతివి నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండమీదే కొలువుంటానని తల్లితండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం సిద్ధిస్తుందనీ శివుడు వరమిస్తాడట. తమిళంలో 'పళం' అంటే 'ఫలం', 'నీ' అంటే 'నీవు' అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట.
కావడీ ఉత్సవం!
దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే, ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరినవాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి, కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమిమీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువవడంతో- కావడిని కిందపెట్టి సేదతీరతాడు ఇడుంబుడు. కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు సరికదా, అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు- కొండమీదకి పరుగెడతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి, మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి, కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్ళకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. 'నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తార'నీ చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు... వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందనీ దాంపత్య దోషాలు తొలగిపోతాయనీ నమ్ముతారు.
ఏమిటీ నవ పాషాణం!
పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూలవిరాట్టుని దర్శించుకుని, తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులూ తొలగిపోతాయని నమ్మేవారు.
దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో "భోగర్" అనే సిద్ధుడు తయారుచేశాడట. అందుకే దీన్ని నవ పాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, తొమ్మిది అనీ; పాషాణ అంటే విషం, ఖనిజం అనీ అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటినుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారుచేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాణాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధగుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలూ పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టురోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం (చెమట) పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందనీ, గంధంతోపాటు కారే నీటిచుక్కలు ఆకుపచ్చరంగులో ఉంటాయనీ అంటారు. వీటిని ఒడిసిపట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీనతీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షలకొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారనీ, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడంవల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్లి వాటి సంఖ్య పెరగడంవల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన.ఆదిత్యయోగీm
"ఎవరీ సిద్ధ భోగర్?"
క్రీ.పూ. 550-300 కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైగావూర్‌లో జన్మించాడు. ఈయన తన తల్లి, తాతల దగ్గర విద్యను అభ్యసించి, కాలంగి నాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడనీ ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణమేంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి, పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారుచేసి, పళని కొండమీద ప్రతిష్ఠించాడనీ, ఆపై విగ్రహాన్ని పాలూ పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడనీ చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద గుహలోనే భోగర్ జీవసమాధిలోకి వెళ్లినట్లు చెబుతారు.
తమిళనాట పేరొందిన పద్ధెనిమిది మంది సిద్ధుల్లో కాలంగి నాథర్ ఒకరు. గురువైన కాలంగి నాథర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్లినట్లూ; శ్రీలంక మీదగా తామ్రపర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లూ సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు పదహారో శతాబ్దం వరకూ ఈ ప్రాంతంలో ఉండేవారనడానికి ఆధారాలున్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు. కానీ ఏమిటనేది తెలియలేదు. అయితే "గట్టి లింగం, గుర్రంపన్ను, నల్ల పాషాణం, రస సింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, సీలై పాషాణం" ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహాన్ని తయారుచేశారని కొందరంటారు. ఆ మూలికలకోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారనీ అంటారు.
అందుకే... పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం..!
పంచామృతం!
లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే, పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పళని సుబ్రహ్మణ్యస్వామే. మహత్తరమైన రుచీ ఔషధ, పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుందట. ఎంత పాతబడితే అంత రుచి అనీ అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండల్లోని విరుప్పాచ్చి అనే ఊళ్లో మాత్రమే పండే వేలెడంత సైజు తియ్యని అరటిపండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరకుతో చేసిన ముడి పంచదార చేర్చి, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాళ్లలో కలిపి తయారుచేస్తారు....*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి